చూపుడు వేలు. కవిత

విరించి ll చూపుడు వేలు ll
----------------------------------------

ఇదేమీ పిడికిళ్ల వ్యవసాయం కాదు
సూర్యుడు మనం మొలకెత్తమన్న చోటల్లా మొలకెత్తడు
కలం పారించేది ఎంతకైనా రక్తం కాకూడదు
కానీ పదం చేతబట్టుకున్న తొందరలో
పదం హృదయానికి తట్టుకున్న ఆనందంలో
నీకు తెలియకుండానే
ఎంతెంత దూరం పాకాలని చూశావో..
ఎందరెందరి ఆకలి పేగులను
ఉరికొయ్యకు అర్పించాలని అనుకున్నావో..

తమ్ముడా
ఇదే అరణ్యం. దండనల అరణ్యం.
క్రూరజంతువులు మనుషులు రూపంలో
సంచరించే జనారణ్యం
చేతిలో పదమున్నవాడు
గొంతులో గేయమున్నవాడు
డప్పుల మోతలతో హూరెత్తించాల్సిన దివ్య స్థానం.
చెట్ల మధ్యన..పుట్ల మధ్యన
నిప్పులు వేసి మహూగ్రంగా
పుట్టించే దావానలానికి
బూడిద తప్ప మరో ఫలితం లేదు.

ఇప్పుడు నిప్పులు కాదు
ఆలోచనలు కావాలి.
అడవినిప్పులు ఇక్కడ చిప్పిల్లాలి.
రాజ్యం మీద చేసే పోరాటంలో
ఆకలి పోరాటాల ఊసెత్తకపోతివే
ఆకలికి మసిలే వాడిలో
రక్తమెంతగా మరుగుతుందో తెలిసిన వాడివి
నీ పాటతో చల్లబరచలేకపోతివే..

గుండెల్లోకి తూటా దిగినంత సులువుగా
మాట దిగక పోవచ్చు
కానీ మాట పాటౌతది.
పాట పథమోతది.
పొద్దుగాల ఇన్న పాట రాత్రి దాకా వినబడుతున్నట్టు
నీ పాట చెవి పక్కన హోరౌతాది.
ఆకాశ చిల్లుల మీద కవిత కట్టినవాడివి
దిగంతాలావలకి ఓండ్రపెట్టి చెప్పకపోతివా
కాలానికి ఎంతో ముందున్నవాడివి
బాటల మీద పూలు చల్లకపోతివా?

పోరాటం చేయాల్సిందే
కానీ ఎంతగా ఎండిన రక్తం పారుతుందో
సోయపెట్టాల్సిందే..
అరే..ఇది దోర దోర యాపిల్ పండ్ల రక్తం కాదు.
మగ్గిన మామిడి పండ్ల రక్తం కాదు.
డొక్కలు మాడిన ఆకలి రక్తం
చెంపలమీద అట్టగట్టిన కన్నీటి రక్తం.
అడవి చెట్లమీద ఎండిన పులిపండ్ల రక్తం.
ఉరకడానికి సత్తువ లేని ప్రవాహంలో
రక్తమెంత కనలి ఉంటుందో చూశావా?
ఆత్రంగా గన్ను పట్టుకోవాల్సిన తరుణంలో
నులిమేస్తున్న పొట్టను పట్టుకున్న విషాదాన్ని
ఊహించావా?

వద్దు.
ఈ వ్యవసాయం వద్దు.
ఈ పాటల ఎరువులు వద్దు.
పిడికిలి కంకులు జనం మధ్య మొగ్గ తొడగాలి.
జనారణ్యంలో ఏపుగా ఎదగాలి.
దండనల అరణ్యంలో పాటై దండెత్తాలి.
ఊరి మధ్యన ఒక వేలుతో ప్రశ్నిస్తున్న హక్కులా నిలబడాలి.
కొడవలిలో బిగించిన మూడు పిడికిళ్ళే కాదు
కూడలిలో తల ఎత్తిన చూపుడు వేలుకూడా యాదుంచాలి.
మన ఆట పాటలో ఆయుధం లేనపుడు..
కలంతో కాటి దిక్కుకు పొడుసుడాపి
కదిలించే కమ్మని కవిత్వం రాయాలె.

9/5/18

Comments

Popular posts from this blog

ఆరాల వాళ్ళు. కవిత

Kaala film review