ఆరాల వాళ్ళు. కవిత

విరించి ll ఆరాల వాళ్ళు ll
------------------------------------

కమ్మని కవిత్వం నేను రాస్తానన్నాను.
అందులో మా కులముందన్నారు వాళ్ళు.

ఛందో బద్ద పద్యం చేస్తానన్నాను నేను.
దారపు పోగులున్నాయా అని అడిగారు వాళ్ళు

ఆకలిని ఇంకుతో  పేపరుపై చెక్కుతానన్నాను
ఎర్రింకు వాడకూడదన్నారు వాళ్ళు.

పాట పాడుతూ సాపాటు మరుస్తానన్నాను.
లోలోపలనే పాడుకోమన్నారు వాళ్ళు

శ్రామికుడి కండల శిల్పం చెక్కుతానన్నాను
శిలలా నిలబడిపొమ్మన్నారు వాళ్ళు.

విశ్వనరుణ్ణి చిత్రిక పడతానన్నాను
ముఖం చిట్లించి నాదేవూరని అడిగారువాళ్ళు.

చిన్నారుల నవ్వుల్లా నాట్యం చేస్తానన్నాను
చీపని చీదరించుకున్నారు వాళ్ళు.

కళ ఏదీ లేనపుడు బతకడం ఎందుకన్నాను నేను.
చావడం మంచిదన్నారు వాళ్ళు.

ఎవరు మీరంతా అడిగాను నేను
కవులమన్నారు వాళ్ళు
కళాకారులమన్నారు వాళ్ళు.

కాళ్ళు కాలుతూ ఎడారిలో నిలబడి నేను
పీఠాలమీద నీడల్లా బాసింపట్టుతో వాళ్ళు.
కులమేదని మతమేదని
ప్రాంతమేదని పార్టీ ఏదనే ఆరాల వాళ్ళు

నిబిడాశ్ఛర్యంలో నేను.
విషం కక్కుతూ వాళ్ళు.

9/5/18

Comments

Popular posts from this blog

చూపుడు వేలు. కవిత

Kaala film review