Kaala film review

"కాలా" A film for coming Elections?
-------------------------------------------

"కాలా" సినిమా చూసినపుడు రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి దర్శకత్వ ప్రతిభ. చెప్పదలచుకున్న అంశాన్ని వివిధ దశలలో కనుల ముందు దర్శింప చేయటంలో పా.రంజిత్ విజయాన్ని సాధించాడు. తమిళ ఫార్ములా సినిమాలకు భిన్నమైన కథను కథనాన్ని అతడు తెరమీద నిలుప గలిగాడు. కెమెరాను ఉపయోగించిన విధానం గానీ, సినిమా పేసింగ్ ను అవసరమున్న చోట తగ్గించిన విధానం గానీ..బీజీఎం సహాయంతో అవసరమైన ఎమోషన్ ని రాబట్టడంలో గానీ ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్ లను మలచిన విధానం గానీ, ఆర్టిస్ట్ ల ముఖాలను మాత్రమే హైలైట్ చేసిన విధానం గానీ చాలా కొత్తగా, విభిన్నంగా ఉన్నాయి. కథ చెబుతున్న కెమెరా, కథతో పాటుగా ఎన్నో ప్రాపర్టీస్ ను కథకు తోడ్పడే విధంగా మలుచుకుంటుంది. అసురుడు పుస్తకం కనబడటమే కావచ్చు లేదా బౌద్ధాలయం కావచ్చు, అంబేద్కర్ పెరియార్ ల పటాలే కావచ్చు,  అవి చెప్పదలచుకున్న అంశానికి తగినంత ఫిలాసాఫికల్ బ్యాగ్రౌండ్ ని ఏర్పరచటానికి ఉపయోగ పడ్డాయి. ఇటువంటి విధానం కమల్ హాసన్ తీసిన "హేరామ్" సినిమాలోనూ కనిపిస్తుంది.

కానీ రంజిత్ ముఖ్యమైన పాత్రల రోల్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం ఒక ప్రధానమైన లోపం. ఈ సినిమాలో అసలు కాలా ఎవరు?. లోకల్ లీడరా? లోకల్ డానా? రౌడీనా? అలాగే నానాపటేకర్ ఎవరు?.ఎంపీ నా? ఎమ్మెల్యే నా? లోకల్ లీడరా? జరీనా పాత్రధారి ఏదైనా ఎన్జీవో కి పనిచేస్తోందా?. అసలామె ఇండియా కు వచ్చి ఏం చేయదలచుకుంది?. ఇటువంటి అంశాలు సినిమా కథలో ఒక భాగంగా జరిగిపోతాయే తప్ప ఇంకా కొన్ని సీన్లతో వీళ్ళ పాత్రలను ఎస్టాబ్లిష్ చేయక పోవడం కథనంలో ఒక లోపంగా కనిపిస్తుంది. దీనివలన కథలో భాగంగా ఈ పాత్రలను అర్థం చేసుకోనివారికి వీళ్ళు ఎవరు? ఏమిటి? అనే సందిగ్ధత ఉండిపోతుంది. ఇక జరీనా పాత్ర వేసిన ఆర్టిస్ట్ నటన చాలా పేలవంగా ఉంది. తెచ్చి పెట్టుకుని నటిస్తున్నట్లుగా ఉంది. పైగా ఈ పాత్ర ఔచిత్యమూ పెద్దగా ఏమీ లేదు. కానీ కాలా భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమను అనుబంధాన్నీ ఎస్టాబ్లిష్ చేయటానికి ఉపయోగపడిందని చెప్పాలి. ఐనా పాత చింతకాయ పచ్చడిలా ఆ భార్య పాత్రను చంపడం ఒక రొటీన్ ఆలోచనే. అన్యోన్య దాంపత్యం బహుశా ఎవరికీ ఇష్టముండదేమో.

ఇదిలా ఉంటే రెండవ అంశం ఏమంటే కాలా ద్వారా చెప్పాలనుకున్న విషయం. లేదా చెప్పాలనుకున్న వాదం. అది అంబేద్కర్ వాదమా?. దళిత వాదమా?. ద్రవిడ వాదమా?. అంబేద్కర్ వాదం దళిత వాదం మాత్రమే కాదు. అది బహు విస్తృత మైన ఫిలాసఫీ. దళిత వాదం మాత్రం అంబేద్కర్ వాదంలో ఒక భాగం. దళిత వాదానికి ఆలంబన మహనీయుడు అంబేద్కర్. ఆయన ఆలోచనలు ఎందరో అణగారిన వర్గాలను ఆలోచింపజేసి పునరుజ్జీవింప చేసాయి. మరి ఈ ద్రవిడ వాదం ఏమిటి?. ద్రవిడ వాదం ఖండించేది ఆర్యుల ఆధిపత్యాన్ని. అంటే దాని పునాది "ఆర్యన్ ఇన్వాషన్ థియరీ" లో ఉంది. దాని ప్రకారం ఆర్యులు అనబడే ఒక జాతి ఎక్కడినుండో భారత దేశానికి వచ్చి ఇక్కడి మూల వాసులను ఓడించి భారతదేశాన్ని ఆక్రమించిందనీ, వారే వేదాలు ఇతిహాసాలు రాశారనీ చాతుర్వర్ణ వ్యవస్థను వారే నెలకొల్పారనీ, వారే బ్రాహ్మణులుగా చెలామణై ఇతర వర్ణాల వారిని అణగదొక్కారనీ చెబుతుంది. ఐతే ఈ వాదానికి అంబేద్కర్ గారు వ్యతిరేకమా కాదా అనేది ఆసక్తికరమైన అంశం. 'Who were the sudras" అనే పుస్తకం లో నాలుగవ అధ్యాయము మొత్తం ఈ Aryan invasion theory ని ఖండించడానికే అంబేద్కర్ గారు వినియోగించారు. ఇది పశ్చిమ దేశీయుల అర్థం లేని వాదనగా ఆయన కొట్టిపారేశారు. ఋగ్వేదం లోని ఎన్నో ఋక్కులను ఆయన కోట్ చేస్తూ సశాస్త్రీయంగా ఆర్యులు అనబడే వారు అసలు ఒక జాతే కాదని వాదించారు. ఇది ఒక భాషా పరమైన పదమే తప్ప ఒక జాతిని ఉద్దేశించిన పదమే కాదన్నారు. ఇండో జర్మన్  భాషలకు ఆర్యన్ భాషలు అని పేరు. ఆ విధంగా ఆర్య శబ్దం భాషా పరమైన మూలాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. పైగా వర్ణ పదాన్ని "రంగు" అనే ఉద్దేశంలో వాడబడలేదనీ వివరించారు. ఆర్యులు తెల్లగా ఉంటారు అనేది పాశ్చాత్యుల కల్పితమనీ అన్నారు. రాముడు, కృష్ణుడూ తో పాటు వేద ఋషులైనటువంటి దీర్ఘతమస్ కానీ కణ్వుడు కానీ నల్లని వారే అంటారు. వేదంలో కలర్ ప్రెజ్యుడిస్ ఏ మాత్రమూ లేదనీ అది ఉన్నది యురోపియన్లకే అనీ అంటారు. పైగా ప్రొఫెసర్ రిప్లేయ్ పరిశోధనలను ఉటంకిస్తూ పురాతన యురోపియన్ లు నల్లని వారని కూడా అంబేద్కర్ గారు ఆధారాలు చూపుతారు.

కానీ కాలా సినిమాలో "రంగు" అనేది ఒక ప్రధాన అంశం. ఇది ద్రవిడ వాదం నుండి వచ్చిందనేది అర్థమవుతుంది. అంబేద్కర్ గారి ప్రకారం, "ఆర్యన్ ఇన్వాషన్ థియరీ" ఎపుడో చచ్చి పోయింది. కానీ ఆ థియరీని అట్టి పెట్టుకునే వారు లేదా ఆ థియరీని బతికించుకున్న వారు ఇద్దరే ఇద్దరు. 1.యురోపియన్ అండ్ 2.బ్రాహ్మిన్. యురోపియన్ లు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి "భారతదేశం పైకి దండయాత్ర చేసి వేదాలు రాసిన గొప్ప జాతి యురోప్ లో ఉద్భవించిన 'ఆర్య' అనే సంచార జాతి" అని చెప్పుకోవడానికి ఉపయోగించుకుంటే, ఈ దేశంలోని మెజారిటీ బ్రాహ్మణులు ఆ థియరీ ని నిజమని నమ్మబలుకుతూ ఇక్కడి ఇతర కులాల మీద తమ సుపీరియారిటీని యూరోప్ కి లింక్ చేయడం ద్వారా చూపించుకోదలిచారు అన్నది అంబేద్కర్ గారి నిరూపణ. కాబట్టి ద్రావిడ వాదానికి పునాది బ్రాహ్మణ ఆధిపత్య ఖండననే ప్రధానం తప్ప దాని మూలం అంబేద్కర్ గారు ఖండించిన ఆర్యన్ ఇన్వాషన్ థియరీలో లేదు. అలాంటపుడు ద్రావిడ వాదం వినిపించే "కలర్" కు తనదైన కొత్త పంథా ఉంది తప్ప వేద ఇతిహాస మూలం లేదు. పైగా‌ తమిళ రాజకీయాల్లో "ద్రవిడ జాతీయవాదం" చాలా కీలకమైన అంశం. ద్రవిడ వాదానికి అంబేద్కర్ వాదం ఊతమిచ్చిందేమోగానీ ద్రవిడ వాదం ఆర్యన్ ఇన్వాషన్ థియరీ కి సంబంధించినంత వరకు అంబేద్కర్ వాదంతో కలిసి పనిచేయదు. రామాయణం ప్రకారం రావణుడు బ్రాహ్మణుడు, కానీ ద్రవిడ వాదం ప్రకారం రావణుడు తమవాడు. ఆర్యుడైన రాముడు ద్రవిడుడైన రావణుడిని చంపేశాడు. ఇతిహాసాలలోని రాక్షసులంతా ద్రవిడులే అనేది వారి వాదన. కానీ ఆర్య ద్రావిడ పదాలు భాషా సంబంధమైన వే తప్ప జాతుల పేర్లు లేదా ఈ జాతులు నివసించిన ప్రాంతాల పేర్లూ కాదన్నది మనకు అంబేద్కర్ గారి ఈ రచనలో అర్థమవుతుంది. మరి ద్రవిడ వాదమేమిటి?. అది కేవలం తమిళ రాజకీయ పరమైన లోకల్ వాదం మాత్రమేనా లేక దక్షిణ భారతదేశం మొత్తానికి ఉపయోగపడే వాదమా?. ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు లోతుగా apolitical గా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి
ఆలోచనల్లోంచి వచ్చిన దళిత వాదం కావచ్చు మరే అణగారిన వర్గాల వాదం ఐనా కావచ్చు, వాటికీ, అంబేద్కర్ గారు ఖండించిన ద్రవిడార్య జాతి వాదానికీ మనం ఎక్కడ లింక్ పట్టుకోవాలి?. ద్రవిడ జాతీయవాదం అణగారిన ద్రవిడుల నుండి వచ్చిందా లేక అది అప్పటికప్పుడు తమిళనాట పుట్టిన ఒక రాజకీయ వాదమా?. ఏదైనా అది ఒక ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వాదమన్నది సుస్పష్టం.

ద్రవిడ వాదమనే అంతటి తమిళ ప్రాంతీయ వాదాన్ని ఇపుడిపుడే రాజకీయాలు మొదలు పెడుతున్న రజినీకాంత్ మరలా వినిపించదలచడంలో స్పష్టమైన రాజకీయ కోణం ఉంది అనిపించక తప్పదు. తమిళుడు కానటువంటి, ద్రవిడ వాదం ప్రకారం చూస్తే ద్రవిడేతర మత విశ్వాసాలు కలిగున్నటువంటి రజినీ కాంత్ ఈ సినిమా ద్వారా తమిళ ప్రజల నుదుటన ద్రవిడ ముద్రను పునర్ముద్రించదలిచాడా?. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడలకు సమాధానం మాత్రమేనా లేక రాజకీయ అనిశ్చితి ఏర్పడిన తమిళ నాట మళ్ళీ ఒక కుదుపుతో కూడిన ద్రవిడ జాతీయతను కూడా పునః సృష్టించే ఎత్తుగడనా?. అసలు కథ పా. రంజిత్ దేనా లేక తెరవెనుక రజినీదా...?. గత నాలుగైదు దశాబ్దాల తమిళ రాజకీయాలను అర్థం చేసుకోకుండా ఈ సినిమాను వ్యాఖ్యానం చేయకూడదేమో అనిపిస్తుంది. కానీ రాబోయే ఎలక్షన్లు ఈ సినిమాకు సమాధానం చూపితే ఈ సినిమాలోని వాదం తమిళులకే పరిమితమైన ద్రవిడ వాదమే. ఎలక్షన్ల లోపు రజినీ ఇంకో సినిమాతో ఎలా వస్తాడో అన్నది ఆసక్తికరం.

విరించి విరివింటి
12/6/18

Comments

Popular posts from this blog

చూపుడు వేలు. కవిత

ఆరాల వాళ్ళు. కవిత