Film essays. Melancholia
మెలాంఖోలియా.
----------------------
"మన భూగోళం పాపిష్టిది. ఇది వినాశనం ఔతున్నపుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు". అంటుంది జస్టిన్. భూమి మీద జీవితాన్ని జీవన మాధుర్యాన్ని ఎన్నో రకాలుగా నాశనం చేసుకుంటున్నాం మనం. ఎంతగా ద్వేషాల్ని, విద్వేషాల్ని నూరి పోసుకుంటూ, పోగుచేసుకుంటూ మనుషులమని చెప్పుకు తిరుగుతుంటాం మనం. నాగరికత అనీ, ఎంతో అభివృద్ధి చెందామనీ ఎన్నో బీరాలూ పలుకుతుంటాం. కానీ....ఈ జీవితం మొత్తం...ఈ నాగరికత, అభివృద్ధీ మొత్తం..ఒక్కసారిగా కుప్పకూలిపోతే...? అంతమైపోతే..? వస్తుందా అటువంటి రోజు?. భూమి మొత్తం సర్వనాశనమయ్యే రోజు వస్తుందా?. ప్రపంచంలో యుద్ధాలు ఒకవైపు, శాంతి చర్చలూ ఒకవైపు...మూడో ప్రపంచ యుద్ధం వస్తే తప్ప ప్రపంచం అంతమైపోదు అనుకునేవారికి మనం విశాలమైన అంతరిక్షంలో భూమి అనే గ్రహం మీద ఉన్నామని గుర్తుచేయకతప్పదు. మనలను నాశనం చేయడానికి అంతరిక్షంలో ఎన్నో అస్టరాయిడ్లు, తోకచుక్కలూ, గ్రహాలూ వేచి చూస్తున్నాయి. అనంతమైన అంతరిక్షంలో ఒక చోట శూన్యంలో వేలాడే ఒక గ్రహం మీద మనం అంతగా ఆశలు పెంచుకోవడానికి ఏమీ లేదు. పైగా మన సుందర భూగోళాన్ని పాపిష్టి ప్రపంచంలా మార్చుకున్నాక ఏ గ్రహశకలమో వచ్చి ఢీకొంటే మనం ఈ పాపిష్టి భూగోళం గురించి అంతగా బాధ పడవలసిన అవసరమేమీ లేదు. ఇట్ డిజర్వ్స్ టోటల్ డిస్ట్రక్షన్.
సూర్యుడి వెనుక ఇంతకాలమూ దాక్కున్న ఒక గ్రహం అకస్మాత్తుగా మన భూమి వైపు దూసుకుని వస్తే...ఆ గ్రహం గురు గ్రహమంత పెద్దదిగా ఉంటే...ఆ గ్రహం మన జీవితాలకు చరమ గీతం పాడబోతోందని కేవలం రెండు రోజుల ముందుగా మాత్రమే మనకు తెలిస్తే...? అపుడు ఏం జరుగుతుంది?. ఏమో.., ప్రపంచం అంతా ఎలా స్పందిస్తుందో, దేశాలూ, దేశాధ్యక్షులూ, మీడియా ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ...జస్టీన్, క్లైర్ అనే ఇద్దరు అక్క చెల్లెల్లు ఎలా స్పందిస్తారు అనేదే "మేలాంఖోలియా" అనే సినిమా. మేలాంఖోలియా అనేదే ఆ గ్రహం పేరు.అక్క క్లైర్ కు లియో అనే చిన్నారి ఉంటాడు. క్లైర్ భర్త జాన్ ఒక ఆస్ట్రోనమిస్ట్. అతడికి ఖచ్ఛితంగా తెలిసిన విషయం ఏమంటే, ఈ గ్రహం నిమిషానికి అరవై వేల కి.మీ. ల వేగంతో భూగోళానికి అతి దగ్గరగా దూసుకుపోతుందే తప్ప భూమిని ఢీకొనదు అని. ఇటువంటి సందర్భాలలో సైంటిస్టులకు నమ్మకాలు ఉండవు, వాళ్లు కేవలం లెక్కలు మాత్రమే మాట్లాడతారు అనుకోవడానికి కూడా ఏమీ లేదు. అతడు ఇపుడు లెక్కలు చెప్పడం లేదు..'మేలాంఖోలియా భూమిని ఢీకొనదు' అని నమ్మకంగా చెబుతున్నాడు..అంతే!. భూమి అంతం తప్పదని తెలుసుకున్న జస్టిన్, సివియర్ డిప్రెషన్ లోకి వెల్లిపోతుంది. లియో తన పిన్నిని 'మ్యాజిక్ గుహ' కట్టుకుందాం అని ఆటకు పిలుస్తూ ఉంటాడు. జాన్ నమ్మకాన్ని చూసి ధైర్యంగా ఉన్న క్లైర్, చెల్లెలు జస్టిన్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఒక్కరోజులో పరిస్థితులు తారుమారవుతాయి. క్లైర్, జస్టిన్ లు ఒకరికొకరు వ్యతిరేక దిశలో పయనించడం మొదలు పెడతారు. క్లైర్ మెలమెల్లగా బాధలోకి జారుకుంటూ ఉంటుంది. జస్టిన్ మాత్రం డిప్రెషన్ నుండి ఎన్లైటెన్మెంటు వైపు పయనిస్తుంది. తనకూ తన మేలాంఖోలియా గ్రహానికీ మధ్య విడదీయరాని ఒక రొమాంటిక్ అనుబంధాన్ని ఆమె కనుగొంటుంది. కఠోపనిషత్తు చెప్పే రెండు పక్షుల కథ కంటిముందు కనబడినట్టుగా ఉంటుంది. ఫలాలనూ, ప్రతిఫలాలనూ అనుభవించే పక్షిలాగా క్లైర్, ఈ జీవిత నాటకాన్నంతా సాక్షీభూతంగా చూసే పక్షిలాగా జస్టిన్. సైన్సును నమ్మలేమనీ, ప్రతీ లెక్కలో ఎర్రర్ కి స్థానముంటుందనీ జాన్ తెలుసుకుంటాడు. ఇక గ్రహం భూమిని ఢీకొట్టడానికి కొన్ని నిముషాలముందు లియో, భయమేస్తుందని పిన్ని జస్టిన్ తో చెప్పి ఏడుస్తాడు. మ్యాజిక్ గుహ కట్టుకునే ఆట ఆడదామని పిన్ని చెబుతుంది. మ్యాజిక్ గుహను కొన్ని కట్టెపుల్లలతో కట్టుకుంటారు. జస్టిన్, క్ల్రైర్,లియో ముగ్గురూ అందులో కూర్చుని భూమి మీద చివరి శ్వాసలూదుతూ ఉంటారు. ఒక మెరుపులా, ఒక ప్రళయంలా, ఒక వెలుగులా భూమి మీద మానవుని జీవితం అంతమవుతుంది.
ఒక చోట జస్టిన్ అంటుంది క్లైర్ తో..."మన భూగోళం పాపిష్టిది. ఇది వినాశనమయ్యేటపుడు మనం బాధ పడవలసినది ఏమీ లేదు. ఈ అనంత విశ్వంలో భూగ్రహం మీద మాత్రమే మానవుడు ఉన్నాడు. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి వారిమి" అని. అందుకే ఏ తోకచుక్కో...గ్రహమో...గ్రహశకలమో భూమిని వచ్చి గుద్దుకుంటే...కేవలం భూమి మీదే కాదు...మొత్తం విశ్వంలోనే మానవుడి జీవితం అంతమవుతుంది. మనం ఈ విశ్వంలో ఒంటరి వారిమి. 2011లో ఈ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమాలో ఒక సీక్రెట్ కోడ్ ఉందనీ..దాని ప్రకారం ఈ సంవత్సరం 2018 జులైలో అట్లాస్ అనే తోకచుక్క భూమిని ఢీకొంటుందని కూడా యూట్యూబ్లో కొన్ని కాన్స్పిరసీ వీడియోలు ఉన్నాయి.
యాంటీ క్రైస్ట్ వంటి అద్భుతమైన సినిమా తీసిన లార్స్ వాన్ ట్రైయర్ ఈ సినిమాతో మనల్ని ఆలోచనలో పడవేస్తాడు. ఈ శతాబ్దంలో వచ్చిన గొప్ప సినిమాల జాబితాలో ఉండిపోయే సినిమా. ట్రెడీషనల్ హాలీవుడ్ హంగామా లేకుండా నలుగురు ప్రధాన పాత్రధారులతో మనసును పిండేసే సినిమా ఇది. చూసిన తరువాత ఆకాశాన్ని చూసినా చంద్రుడిని చూసినా వళ్లు గగుర్పొడుస్తుంది. రెండు మూడు రోజులపాటు "మేలాంఖోలియా" మనసు తెర మీద చెరగని ముద్రవేస్తూ..ఇకనైనా ఈ భూమి మీద మనిషిని హాయిగా జీవించమని చెబుతుంది. జస్టిన్ లాగా మనమూ మేలాంఖోలియా ప్రేమలో పడిపోతాం.
విరించి విరివింటి
18/3/18
(Warning: Above 18 yrs only)

Comments
Post a Comment