Essay- Ramayanam nirmanatmaka anirmanam
రామాయణం- నిర్మాణాత్మక అనిర్మాణం.
------------------------------------------------------
"God can love even an imperfect human being but a human being cannot love an imperfect God". మనిషికి తాను కొలిచే దేవుడు తప్పనిసరిగా పరిపూర్ణుడై ఉండాల్సిందే. పరిపూర్ణుడు కాని దైవాన్ని మనిషి సహించలేడు. మతాల గొడవలంతా మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప అనే విషయంలోనే. "మీ దేవుడు చూశావా ఎలా చేశాడో..మా దేవుడు మీ దేవుడికంటే పరిపూర్ణుడు కాబట్టి మీ దేవుడిలాగా ప్రవర్తించలేదు". అని ఒకరి దేవుడి మీద మరొకరు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఐతే భగవంతుడి అవతారం దశలవారిగా పరిపూర్ణతను సాధిస్తుందని చెప్పే పరిణామవాదమూ ఉంది. దశావతారాల క్రమంలో అటువంటి పోలిక కనిపిస్తుంది. ఐతే దశావతారాల కల్పన వైష్ణవ మత ఫలితంగా విష్ణువును దేవాదిదేవుడిగా నిలపడం కోసం సమీప గతంలో జరిగిన ఓ ప్రయత్నం. ఈ ప్రయత్నం కనీసం శ్రీరామ శ్రీకృష్ణ భక్తులను పోట్లాడుకోకుండా కలిపి ఉంచింది. ఈ మధ్య భీమాంజనేయ యుద్ధం వంటిది కూడా భద్రాచలంలో అలా కనిపించి పోయింది. ఇవన్నీ పక్కకు పెడితే "రామాయణంలో రాముడు ఎవరు?" అనే అంశం చాలా ఆసక్తికరమైనది. ఆయన భగవంతుడి అవతారమని వాల్మీకి రామాయణంలో చెప్పబడలేదని వృద్ధుల కళ్యాణరామారావు గారి ఉవాచ. వాల్మీకీ రాముడు కేవలం "సీతారాముడు" మాత్రమే. భగవంతుడో, విష్ణువవతారమో వాల్మీకీ దృష్టిలో కాదు.
ఈమధ్య ఒకతను 'రామ' అనే శబ్దమే తనకు బూతు మాటలా వినిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఏం? ఆ మాటలో, ఆ పదంలో అంత బూతు ఏముందని? నాకు తెలిసి ఈ మిత్రుడికి వాల్మీకీ రాముడిలో 'భగవంతుడంటే ఇలా ఉండాలని' మనం ఆపాదించుకున్న సంపూర్ణ లక్షణాలు బహుశా కనిపించలేదేమో. అందుకే రామ పదం బూతులాగా కనపడి ఉండవచ్చు. ఇలా రాముడిని అతిగా ద్వేషించే వారు కనీసం రామాయణం చదివి ఉంటారని అనుకోలేం. వారి ఈ అవగాహనకు ఏ సినిమా రామాయణమో లేక ఇంకెవరో చేసిన పైపై అనువాదం లేదా వక్ర భాష్యమో ఆలంబన అయివుంటుంది. పైగా ఆ సినిమాల్లో చూపిన రాముడే వాల్మీకి రాసిన రాముడు అనుకుంటూ ఉంటారు. రామాయణాన్ని వాల్మీకి 8121 శ్లోకాలలో పూర్తి చేస్తే...అవి పెరిగి ఈరోజు 24000 శ్లోకాలయ్యయి. ఇది చాలదన్నట్టు ప్రతీ సినిమా దర్శకుడూ లేదా ప్రవచనకారుడూ లేదా రచయితా తమ తమ సొంత ఊహలతో ఆ కావ్యాన్ని అర్థం లేకుండా పెంచి..అదే అసలైన రామాయణమని నమ్మించే పనిలో పడ్డారు. ఈ మధ్య వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో సీతమ్మను చేతులు కట్టుకుని నిరంతరం ఏడుస్తూ ఉండే మహిళగా చూపించారు బాపు గారు. ఆయన ఏడుపది. అటువంటి చిత్ర రాజములన్జూసి రాముడిని అంచనా వేసే అరమెదడు అతి మనుషులకూ కొదువ లేదు.
వాల్మీకీ రామాయణం రాసిన విధానాన్ని చూసుకుంటే...అప్పటి దాకా ప్రజల నాలికల మీద కదలాడిన ఒక కథను ఆయన గ్రంథస్థం చేశాడనుకోవాలి. పురాతన సమాజాలు అంటే చరిత్ర పూర్వ సమాజాలలో కథలు ప్రజల జీవితాలలో అంతర్భాగాలు ఇప్పటి సీరియళ్లు వార్తలు లాగా. కానీ ఆ కథలన్నీ మౌఖికంగా వ్యాప్తిచెందాయి. ప్రాచుర్యం పొందాయి. తల్లులు పిల్లలకు ఇష్టంగా పదేపదే చెప్పుకున్న కథలివి. దాదాపు ఈ కథలన్నీ ఫెయిరీ కథలు. కట్టు కథలు. కట్టుకథలు అంటేనే నోటితో కట్టిన కథలు. కట్టుకథ అనగానే అదేదో 'అబద్ధపు కథ' అని మనం వాపోతుంటాం కానీ...ఈ కథలు పురాతన సమాజాల ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న జానపద కథలు. అవి ఆయా సమాజాలను నడిపించాయి. కాబట్టి వారి జీవన రీతులనూ పట్టి ఇస్తాయి. ఫెయిరీ కథల్లో ఆశ్చర్య అద్భుత రసం ప్రధానమైనది. అందుకే అవి పిల్లల కథలు. పక్షులూ, జంతువులూ మాట్లాడతాయి. ఆకాశంలోకి కోతులు ఎగురుతాయి. భయంకర కోరలతో ఉండే రాక్షసులను చిన్న చిన్న జంతువులు యుక్తితో చంపేస్తుంటాయి. సూర్యుడిని తినేసి చంద్రుడి మీద నిదురోతాయి. ఈ వర్ణనలలో పిల్లలకు చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. అసలు బాల రామాయణం అవసరమే లేదు, రామాయణమే బాలల కోసం రాసినదిలా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫెయిరీ కథలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయి ఎందుకంటే బాలలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు కనుక. కథలు లేని సమాజాలు ఉండవు కనుక. మనిషికి కథ కావాలి. పురాతన సమాజాలలో మానవుని జీవితం అతడి అభిరుచులూ దాదాపు ఒకేలాగే (uniform) ఉండేవి. (ఇపుడైనా, మనిషి మౌలిక అభిరుచులకు సంబంధించినంతవరకూ ఏ దేశంలోనైనా ఒకటే). కాబట్టి రామాయణాన్ని పోలిన కథలు మనకు చాలా సమాజాలలో కనిపిస్తాయి. పేలియో ఆంథ్రోపాలజిస్ట్ మిసియా లాండా రాసిన పుస్తకం "Narratives of Human Evolution" లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫెయిరీ కథల మార్ఫాలజీ దాదాపు ఒకేలాగా ఉంటుందని చెబుతుంది. "ఈ కథలన్నిటిలో కథానాయకుడు తాను నివసించే సేఫ్ జోన్ నుండి బయటకు వచ్చేస్తాడు. లేదా బయటకు పంపివేయబడతాడు. అప్పటినుండి అతడి అన్వేషణ మొదలవుతుంది. అతడికి ఎన్నో ఛాలెంజ్ లు ఇవ్వబడతాయి. ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ పోతాడు. అతడికి తన మార్గంలో సహాయంగా ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుంది. దాని సహాయంతో అతడు తన లక్ష్యాన్ని చేరి విజయం సాధిస్తాడు. ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిని పొందుతాడు." వాల్మీకీ రామాయణం కూడా దాదాపు ఇదే గీతల మీద సాగుతుందని వేరేగా చెప్పనవసరం లేదు. అంటే ఆకాలంలో నానిన ఏ కథ ఐనా కొన్ని మౌలికమైన నిర్దిష్టమైన pattern of story construction నీ కలిగి ఉంటుంది. కాబట్టి వాల్మీకీ రాముడు ఈరోజు మనం భావిస్తున్నట్లు దేవుడు కాదు. పురాతన ప్రపంచ కథానాయకుడు. పురాతన సమాజ తల్లుల జోల పాటలోకి ఒలికినవాడు. పిల్లల కలల్లోకి ఇంకిన కథానాయకుడు. ఒక్క రామాయణం మాత్రమే కాక పురాతన సమాజాలకు చెందిన కథలన్నీ ఇదే కదా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ నిర్మాణ పద్ధతికి బాహ్యంగా ఉన్న కథా భాగాలను తరువాత చేర్చిన ప్రక్షిప్తాలుగా గుర్తించవలసి ఉంటుంది.
మిసియా లాండా ఈ పురాతన కథలలోని నరేటివ్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవటం ద్వారా మనలను మానవుని గతానికి సంబంధించిన ఎన్నో సందిగ్ధాలనుంచి విముక్తులనుగావిస్తుందని వాదిస్తుంది. ఉదాహరణకు డార్విన్ పరిణామ వాదం తీసుకుంటే ఈ ఫెయిరీ కథల స్ట్రక్చర్కి ఏమీ విభిన్నంగా లేదని అర్థమవుతుంది. డార్విన్ ప్రకారం మనిషి కోతి నుండి పరిణామం చెందాడని కదా. డార్విన్ చెప్పిన ఈ థియరీకీ ఈ రామాయణాది పురాతన కథల కథన శైలి కీ తేడా ఏమీ లేదనేది ఆవిడ వాదన. మొదట ఒక హీరో ఉంటాడు. (ఇక్కడ ఆ హీరో ఒక ప్రైమేట్ జంతువు (కోతి) అనుకుందాం.) అతడు తాను నివసించే చోటునుండి బయటకు పంపించబడతాడు. (He leaves his habitat) అతడు తన ప్రయాణంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటాడు. (అంటే బాహ్య ప్రపంచంలో వాతావరణ విపత్తులనూ, శత్రువులనూ ఎదుర్కొంటాడు). ఆ తరువాత అతడికి ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుంది. (అంటే నాచురల్ సెలెక్షన్ వంటిది జరుగుతుంది). అతడు విజయం సాధిస్తాడు ఉన్న స్థితికంటే ఉన్నత స్థితికి చేరతాడు. (అంటే కోతి నుండి మనిషిగా పరిణామం చెందుతాడు.. మిసియా లాండా ప్రకారం డార్విన్ కూడా తన పరిణామ వాదాన్ని ఒక ఫెయిరీ టేల్ లాగే చెప్పాడు. పురాతన కాలం నుండి మానవుడు వింటున్న కథలలాగే ఆ కథల్లో ఇమిడి ఉన్న కథా నిర్మాణంలాగే తన పరిణామవాద సిద్ధాంతాన్ని తయారు చేశాడే తప్ప మరో విధంగా కాదు. కాబట్టి పురాతన కథల నిర్మాణ శైలి మనకు మానవ పరిణామానికి సంబంధించి ఫాసిల్స్ ఇచ్చే సమాచారం కంటే ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి వాల్మీకీ రామాయణ కథకంటే ఆ కథను ఆయన నిర్మించిన పద్ధతి మానవుడి ప్రాథమిక ఆలోచనా రీతులతో సరితూగుతుంది. 'వాల్మీకీ రాముడు' కూడా ఆ ప్రజల మౌలిక ఎమోషన్లను ప్రతిబింబించేలా ఉంటాడు.
"వాల్మీకీ రాముడు" అని ప్రత్యేకంగా ఎందుకనాలంటే...వాల్మీకీ కథలోని రాముడు అప్పటిదాకా ప్రజల నాలుకమీద నానిన రాముడు మాత్రమే. వారి ఫెయిరీ టేల్ లోని కథానాయకుడు. నిజంగా ఉండిన్నాడా?. ఉండిండొచ్చు. ఆయన కథనే ప్రజలు చెప్పుకుని ఉండొచ్చు. వాల్మీకీ కథగా రాసిన తరువాత కాల క్రమేణా రాముడు కథలో మారుతూ వచ్చాడు. ఆయా కాలాల రాజకీయాలకు అనుగుణంగా మారుతూ వచ్చాడు. మను ధర్మ శాస్త్రము పరిఢవిల్లిన సమయంలో శంభూకుని చంపుకుని, భక్తి ఉద్యమాలు జరిగే కాలంలో శబరిని కలుపుకుని సాగాడు. అంతే కాకుండా పురాతన కథలోని బేసిక్ ఫెయిరీ టేల్ కథా నిర్మాణానికి దూరంగా ఉత్తర రామాయణంతో సీతమ్మను అడవులపాలు చేశాడు. వాల్మీకీ రామాయణంలో సీతా పరిత్యాగం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే పురాతన సమాజంలోని కథలలో దేనిలో కూడా కథానాయకుడు ఇటువంటి వాడు లేడు. మరి, వాల్మీకీ రాముడు సీతను వదిలేసేంత కఠినుడా?. అతడు దేవుడూ కాదు. కఠినుడూ కాదు. కథానాయకుడు. ఫెయిరీ టేల్ కథానాయకుడు. తండ్రి ఆగ్న మేరకు అయోధ్యను వదిలేసాడు. సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి వనవాసం చేశాడు. వనవాసంలో సీతమ్మను గాఢంగా ప్రేమించాడు. వాల్మీకీ రామాయణం ప్రకారం రాముడి జీవితంలో అత్యంత సుందరమైన ఘట్టం రాముడూ సీతా వనవాసంలో ఉండటం. ఇద్దరూ అమర ప్రేమికుల్లాగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆనందంగా గడిపారు. అకస్మాత్తుగా రావణుడి రూపంలో విపత్తు వచ్చి పడింది. విపరీతంగా దుఃఖించాడు. సీతా సీతా అంటూ పలవరించాడు. సీతలేని జీవితం వ్యర్థమనుకున్నాడు. అన్వేషణ మొదలు పెట్టాడు. చెట్లనూ పుట్టలనూ అడిగాడు. ఓ పక్షి వివరం చెప్పింది. ఇంకో చోట ఓ కోతీ జతయ్యింది. ఆ కోతి సమూహ రాజు*(1)నూ కలిశాడు. సహాయం కోసం అతడు కోరిన కోరికలూ తీర్చాడు. అవి ఎంత నీతిమాలిన పనులైనా సీతకోసం చేశాడు. ఎదురుగా ఉంటే సగం శక్తిని లాగేయగలిగిన వాలిని చెట్టు చాటున ఉండి సంహరించాడు. ఇంకోవైపు సీతా సీతా అని దుఃఖిస్తూనే ఉన్నాడు. వానరుల సహాయంతో లంకకు చేరి రావణుని చంపి సీతను తనదాన్ని చేసుకున్నాడు. ఇది ఫెయిర్ ఫెయిరీ కథ. ఇది ఫెయిరీ కథ కాదని ఎవరైనా అనగలరా?. ఇది దేవుడి కథ కాదే..!!. ఎంత సాధారణ మనిషి రాముడు?. తన సహచరి కోసం ఎంతగా తపించాడు?. ఎంతగా ఆమెను ప్రేమించాడు..!! ఎన్నివేల మైళ్లు కాలినడకన వెతికుతూ పోయాడు!!!?. ఏ దైవ మాయలూ చేయలేదే?. టింగున మాయమైపోయి లంకలో తేలలేదే..!! నీటి మీద నడవలేదే...!!? ఏ పర్వతం మీదనో కూచుని ప్రజలకు పది సూత్రాలు బోధించలేదే..!!? ఏ చెట్టుకిందో కూర్చుని తపస్సు చేయలేదే...!!? ఏ యుద్ధరంగంలోనో నిలబడి పుంఖానుపుంఖాలుగా తత్వాలు చెప్పలేదే..!!?. ప్రవచనాలు చెప్పి "ఫైనల్ వర్డ్ ఆఫ్ మైన్" అని పుస్తకాలూ శాసనాలూ రాయలేదే...?. రాముడు ఈ ఫెయిరీ కథలో తనకుండే మానవ శక్తితో ప్రేమతో అసాధ్యమైన వాటితో పోరాడుతూ తుదకు విజయం సాధించాడు. ఇటువంటి సామాన్య మానవుడైన అమర ప్రేమికుడి విగ్రహాన్ని చూడగానే లేదా పేరు వినగానే బూతులా ఎందుకు అనిపించినట్టు?. ఏం రాముడు దేవుడిలాగా లేడనా?. లీలలు చూపించలేదనా?. మొదట ఈయనను దేవుడిని చేసిందెవరు?. చేసి అంతగా కథా రూపాన్ని, ఆ కథా నిర్మాణాన్నీ మార్చిందెవరు?. ప్రజల నాలికలమీంచి పిల్లల ఆటలలోంచి రాముడిని పురవీధుల్లో రథాలమీదకి చేర్చిందెవరు?. కథ రాసిన వాడు వాల్మీకీ. గిరిజనుడు. ఆ గిరిజన జీవిత మాధుర్యాన్నీ, చెట్లనూ పక్షులనూ, జంతువులనూ తన కథలో నింపిన వాడు. ఆ గిరి కథకుడి రాతలను పిచ్చి రాతలని, అదంతా విషమనీ కూసిన అహంకారులెవరు?. ఇవన్నీ మనిషి తన పురాతన సమాజాన్ని వదిలి నాగరికతను సంతరించుకుంటున్న తరుణంలో తన పైత్యాన్ని మూలకథలోకి ఎక్కించటం వలన వచ్చిన ప్రక్షిప్త భావనలు మాత్రమే. చరిత్ర చదవడానికి ఆధునిక శాస్త్రాలు ఉపయోగపడే కొద్దీ పురాతన సమాజ స్వరూపం స్వభావాలు మరింత విస్పష్టమౌతూనే ఉంటాయి.
Foot notes.
*1. లూయీ హెన్రీ మోర్గాన్ రాసిన పుస్తకం "పురాతన సమాజం" లో ఒక విషయం ప్రస్పుటంగా ఉంది. పురాతన సమాజాలలో గణాల పేర్లను జంతువుల పేర్లతో పెట్టుకునేవారట. జాంబవంతుడు, హనుమంతుడు, మున్నగు పేర్లు ఇక్కడున్న గిరిజన గణాలను సూచించేవే తప్ప వారు కోతులు కారు. కానీ ఫెయిరీ టేల్ కథకుడు వారిని కోతి మానవులుగా ఎలుగుబంటి మానవులుగా ఊహించి ఆసక్తి కలిగించి ఉంటాడు. గోపీనాథ్ రాసిన 'అమృతసంతానం'లో కూడా ఈ వివరణ ఉంది.
విరించి విరివింటి
25/3/18

Comments
Post a Comment