Poem - nallati poolu

విరించి ll  నల్లటి పూలు   ll
------------------------

అక్షరాలెపుడూ పూవులు కాలేదు
రాసుకున్న కాగితాలెపుడూ మాట్లాడనూ లేదు
కానీ ఈ ఉదయం పూట
పూవుల్ని గుప్పిట్లో పట్టుకుని
నీతో మాట్లాడాలనుకుంటున్నాను
నీలాగే మాట్లాడాలనుకుంటున్నాను.

ఐనా, నీకేం తెలుస్తుంది...!!
వేళ్ళ చివరన కాలాల్ని బిగబట్టుకుని
కొండంత గొంతుచేసుకున్నదామె
వేళ్ళ కొసటి ట్రిగ్గర్ నొక్కుల శబ్దాలు
ఏ గొంతుకను ఆపగలవని?

నేనిపుడు పూసుకున్నదంతా
ఆ శరీరంలోంచి పొంగుకొచ్చిన నల్లటి రక్తం.
ఎన్ని అసత్యాల మంటల మీద
ఇరానీ ఛాయ్ లాగా మరిగిపోయిందో..ఆ రక్తం
అది కాలీ కాలీ కమిలిపోయిన నిరసనల ప్రవాహం.

ఇదిగో ఇక్కడెన్ని అక్షరాలు...!!
ఆ రక్తం వలెనే నల్లవి.
తెల్లటి కాగితాల మీద
నిరసన గళాలై లేస్తవి.

రంగులద్దిన వాడి ప్రతీ రంగు
వెలిసి పోయేలా...
ప్రతీ రంగూ ఉనికి కోల్పోయేలా
అక్షరాలు నలనల్లగా మెరవాలిపుడు

అరే..ప్రజాస్వామ్యమంటేనే నల్లటి ఇంకు!
ప్రజలకోసం బతకడమంటే....
దానిని వేరేవాడి మీద పోసుడు కాదు.
మనమీదే పోసుకునుడు
నల్లటి అక్షరమై మొలకెత్తుడు
ఎన్ని ముల్లులు గుచ్చుకున్నా
నల్లటి పూలై విరబూసుడు
రక్తానికీ ఇంకుకూ తేడా మర్చిపోవుడు.

నీ రక్త దాహం తీరినపుడల్లా...
అందుకో మా యీ నల్లటి పూలు.
రక్తంతో తడిసిన అక్షరాలు.

 6/9/17

Comments

Popular posts from this blog

చూపుడు వేలు. కవిత

ఆరాల వాళ్ళు. కవిత

Kaala film review