Essay - defective thinking

డిఫెక్టివ్ థింకింగ్

డిమోనెటైజేషన్ జరిగినపుడు, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే నల్లధనమంతా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుందని ప్రధాన మంత్రి చెప్పడం కాదు, దానిని ఔను నిజమే అని ప్రజలు నమ్మడం. ఒక్క డిమోనెటైజేషన్ విషయమే కాదు, రాజకీయ నాయకుల ప్రతీ వాగ్ధానాలను నమ్మడం చూస్తున్నపుడు మనం నమ్మిక ఏర్పరుచుకునే విధానంలోనే ఏదో లోపం ఉందనిపిస్తుంది. మనం కాపాడుకునే ఇటువంటి ప్రయత్నపూర్వక అజ్ఞానం వలననే రాజకీయ నాయకులు వారు చేసే నిర్ణయాలలోని మంచీ చెడులకంటే, మనం ఏర్పరుచుకున్న నమ్మకాలను ఆసరాగా చేసుకుంటారు. మనం అధిక శాతం ప్రజల సగటు అభిప్రాయం మీద ఆధారపడి ఒక నిర్ణయానికి వస్తూంటాం. ముఖ్యంగా ఎలక్షన్లలో ఈ సగటుతనం కనిపిస్తుంది. ఈ సారి ఎలక్షన్లలో ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఎవరు బాగా పనిచేయగలరు, ఎవరు నిజాయితీగా పాలించగలరు, ఎవరి గుణగణాలు ఏమిటి అనే అంశం కంటే అధికశాతం ప్రజలు ఎవరిని సగటున ఎన్నుకుంటారు అనే విషయం ఆధారంగా మనం అంచనాలు వేస్తుంటాం. వారికే ఓటు వేస్తాం కూడా. మెజారిటీ ప్రజలు ఈ సారి సగటున పలానా వ్యక్తి గెలుస్తాడు అనుకుంటున్నారంటే, మనం ఆ వ్యక్తి వైపే మొగ్గు చూపుతుంటాం. ఇదొక మూఢనమ్మకంలాంటి వ్యవహారం. మూఢనమ్మకం ఆచరించేటపుడు ఎటువంటి ఆలోచనా అవసరం లేదు. మూఢనమ్మకం ఆలోచనను ప్రోత్సహించదు. ధర్మం అనే పేరుతో దానిని అలాగే చేయమంటుంది. అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి మనమూ చేయాలనుకోవడం. నిజానికి కామన్ మాన్ కు దేశాన్ని మార్చగల శక్తి ఉండదు. ఈ విషయం మనకు పూర్తిగా తెలిసినా, మనం ఒప్పుకోం. ఓటు వేస్తే దేశాన్ని మార్చేయవచ్చు. తల రాతను మార్చేయవచ్చు. ఓటు మన హక్కు అని మనం భావిస్తూ ఉంటాం. ఓటు వేయడం మన విధి అనుకుంటాం, బాధ్యత అనుకుంటాం. రిలీజియస్ గా ఓటు వేస్తూ ఉంటాం. ఒక ధర్మం లాగా ఒక పనిని చేస్తున్నామంటే, మనం మన ఆలోచనను పూర్తిగా పక్కకు తోసేసినట్టే. ఓటు తప్పని సరీ వేస్తాం కాబట్టి, మన ఓటు మన రాతలని మార్చేస్తుందనే ప్రయత్న పూర్వక అజ్ఞానంలో ఉండిపోతాం కాబట్టి ఎన్నికల చుట్టూ ఏర్పడిన వాతావరణంలో మనం సగటు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుంటాం. మెజారిటీ ప్రజల సగటు అభిప్రాయం ప్రకారం ఈ సారి పలానా వ్యక్తి అధికారంలోకి వస్తాడు కాబట్టి మనం ఆ వ్యక్తినే మన నాయకుడిగా ఊహించుకుంటాం.

డిమోనెటైజేషన్ వలన బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనేది ఒక అవగాహన. నిజానికి నల్లధనం ఉన్నది కొంతమంది దగ్గర. ఆ కొంతమందినీ బాధ పెట్టడం ఇష్టం లేక, ప్రజలందరినీ బాధ పెట్టడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని తీసుకువచ్చారన్నమాట. డబ్బును ఎలాగూ అందరికీ పంచలేం, బాధలనైనా అందరికీ సమానంగా పంచి సోషలిజం స్పూర్తిని రగిలించాలని ఏలిన వారి ఉద్దేశమేమో. కానీ నిజానికి మన ఇన్స్యూరెన్సు చట్టాలూ, న్యాయ వ్యవస్థలూ కాపాడవలసిన వారినే కాపాడతాయి. ముసలి తల్లి ఆరోగ్యం కోసం డబ్బులు దాచుకున్న వాడికీ, ముసలి తల్లి ఆరోగ్యం కోసం ఇన్స్యూరెన్సు చేసిన వాడికీ తల్లిని చూసుకునే విధానంలో బేసిక్ డిఫరెన్సు ఉండనే ఉంటుంది. ఆరోగ్యమొక శారీరక మానసిక స్థితి అని తెలిసినవాడికీ, ఆరోగ్యమొక కొనుక్కోగలిగిన పరిస్థితి అనుకునేవాడికీ ప్రవర్తనలో ఉండే బేసిక్ డిఫరెన్సు వంటిదిది. అప్పులు ఇవ్వగలిగినవాడినీ, పెద్ద పెద్ద నష్టాలను ఇన్ష్యూరెన్సు ద్వారా భర్తీ చేసుకోగలిగిన వాడినీ ఈ వ్యవస్థలు ఎటువంటి నష్టాన్నీ కలిగించకుండా కాపాడుకుంటాయి. అప్పిచ్చు వాడు వైద్యుడని పూర్తిగా నమ్మేస్తుంటాయేమో. అప్పులు తీసుకునే వారూ, డబ్బులు జాగ్రత్తగా దాచుకునేవారివలన సమాజానికి పెద్దగా ఉపయోగం ఉండదు, కనుక వారిని ధనవంతులుగా చేయడం ఒక వృధా శ్రమ. ట్రికిల్ డౌన్ వంటిది జరిగితే తప్ప ధనం పై నుండి కింది వరకూ పారే అవకాశం లేదు కనుక ధనవంతులను మరింత ధనవంతులుగా చేసే ఏ అవకాశాన్నైనా ఇప్పటి రాజకీయాలు వదులుకోవు, వారి క్విడ్ ప్రో కో ల సాక్షిగా. ఇది ఏ గవర్నమెంటుకైనా తప్పని పరిస్థితి. మన ఇంటి కిటికీ ని బాల్ తో పగలగొట్టిన పిల్లవాడిని మనం ఏం చేస్తాం.? ఇంకోసారి పగలగొట్టకుండా తేలికైన బాల్ కొనివ్వడం ఒక పద్దతి అనుకుంటే, గట్టి బ్యాట్ తో కొట్టింటే, బాల్ అసలు ఇంటికే తగలకుండా ఇంటికి ఆవతల ఎక్కడో పడుతుందని ఊహించి, మరింత గట్టి బ్యాట్ కోనీయడం రెండవ పద్దతి. మనం ఎలక్షన్లలో రెండవ పద్ధతిని ఎంచుకుంటాం.

మన జీవితాలలో ఏపొలిటికల్ అంశాలెన్నో ఉంటాయి. వాటినన్నింటినీ పొలిసిటైజ్ చేసే పనిలో ప్రభుత్వాలున్నాయి. మన జీవిత ఆర్థిక సామాజిక సంబంధాలనూ, మనుషుల మధ్య సంబంధాలనూ అన్నింటినీ పొలిసిటైజ్ చేసి పొల్యూట్ చేయడమే ప్రస్థుత రాజకీయాల ప్రధాన ఉద్దేశం. నిజానికి ఇపుడిది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి. ఇదొక క్రైసిస్. దీనికి సమాధానాలు పెద్దగా ఏమీ ఉండవు. అన్నీ ప్రశ్నలే. దిగజారిన మానవ సంబంధాలు విలువలూ మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని పెంచటమూ, మతాల పేరిట, కులాల పేరిట, జాతుల పేరిట, దేశాల పేరిట విడగొట్టడమూ, విద్వేషమూ, చివరికి యుద్ధమూ ఒకదానితరువాత ఒకటి కనిపించక తప్పదు. గ్లోబల్ కాపిటలిస్టిక్ రిజైమ్ ని అర్థం చేసుకోకుండా ప్రాంతీయ రాజకీయ వ్యవస్థల అవినీతినీ, పెరుగుతున్న ప్రజల రేసియల్ రిలీజియస్ బెంట్స్ నీ, పురాతన పద్ధతులలో విమర్శిస్తూ పోవడం వలన ఉపయోగమేమీ ఉండదు. మనకు కావలసినది నిజానికి ఎటువంటి లోపాలూ లేని రాజకీయ ఆర్థిక వ్యవస్థ కాదు, రియలైజేషన్ ని ఇవ్వడానికి ఎటువంటి లోపాలూ లేని ఆలోచనా వ్యవస్థ.

Comments

Popular posts from this blog

చూపుడు వేలు. కవిత

ఆరాల వాళ్ళు. కవిత

Kaala film review